ఫలభరితమైన దేవునిపరిచర్య చేయుటకు మార్గము మన వ్యక్తిగత జీవితములలో దేవుడు అనుమతించే శ్రమలలో గుండా వెళ్ళుటయేనని హోషేయ చెప్పుచున్నాడు. ఒక్కొక్కరి విషయములో దేవుడు దీనిని ఒక్కొక్క రీతిలో చేస్తారు. దేవుని పిల్లలందరకు ఒకే విధమైన సిలబస్ ఉండదు. కష్టతరమైన భార్య ద్వారా దేవుడు హోషేయకు బోధించాడు. కాని భార్య లేకుండానే లోతైన గుంటలలో వేయబడటము ద్వారా యిర్మీయాకు బోధించాడు. పౌలుకు కూడా భార్య లేకుండానే దేవుడు నేర్పించాడు. కాబట్టి అందరికి ఒకే విధానము కాదు. కాని నియమము ఒక్కటే. దేవుని యొద్దనుండి పరిచర్యను పొందుకోవాలంటే శ్రమలలో గుండా వెళ్ళాల్సిందే. పౌలు ఇట్లన్నాడు, "దేవుడు మమ్మును ఏ ఆదరణతో (శక్తితో) ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు" (2 కొరింథీ 1:4). ఆవిధముగా దేవుని పునరుత్థానశక్తిని మనము అనుభవించనట్లయితే, మరణాన్ని కలుగజేసే అక్షరానుసారమైన పరిచర్య మాత్రమే చేస్తాము.
హోషేయ గోమెరును పెళ్ళి చేసుకున్నాడు కాని ఆమె పిల్లలలో కొందరు వేరే వారికి పుట్టియున్నారు. ఆమె మొదటి కుమారుడు హోషేయకు పుట్టియున్నాడు. తరువాత ఇద్దరు బహుశా అతనికి పుట్టలేదు. దేవుడు తన ప్రజలను ఏవిధముగా క్రమశిక్షణలో పెట్టుచున్నాడో, వారి పేరులు తెలియజేయుచున్నవి. దేవుడు ఇట్లనుచున్నాడు, "అది తన విటకాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొనలేక పోవును; ఎంత వెదకినను వారు దానికి కనబడకయుందురు. అప్పుడు అది-ఇప్పటి కంటె పూర్వమే నా స్థితి బాగుగా నుండెను గనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటియొద్దకు వెళ్లుదు ననుకొనును (హోషేయ 2:7). ఇశ్రాయేలీయులు దేవుని యొద్దనుండి ఏవిధముగా వెళ్ళారో అలాగే హోషేయ భార్య కూడా వెళ్ళింది. కాని ఇశ్రాయేలీయులు శ్రమలలో ఉన్నప్పుడు మాత్రమే దేవునిని వెదకియున్నారు. చాలామంది వారు శ్రమలలో ఉన్నప్పుడు మాత్రమే దేవునిని వెదకుదురు. ధనము మరియు ప్రజలు వారి సమస్యలను తీర్చలేక, విడిచిపెట్టినప్పుడు సహాయముకొరకు వారు దేవునివైపు తిరిగి ఆయనను వెదకుతారు (ప్రార్ధిస్తారు). దేవుడు వారికి సహాయము చేస్తాడు. కాబట్టి దేవుడు హోషేయతో ఇట్లన్నాడు, "చిట్ట చివరికి నీ భార్య నీయొద్దకు తిరిగివచ్చిన యెడల ఆమెను చేర్చుకొనుము".
ప్రభువు ఇట్లన్నాడు, "దానికి ధాన్య ద్రాక్షరసతైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చినవాడను నేనే యని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరచెను" (హోషేయ 2:8). ఈ వచనము మనకు కూడా వర్తిస్తుంది. నీకున్నదంతయు దేవుడు నీకనుగ్రహించినదేనని నీవు గుర్తించియున్నావా? నీకున్న సిరిసంపదలు (ధనము) దేవుడిచ్చిన వరమే. నీకున్న తెలివితేటలు కూడా దేవుడిచ్చినవే. బయలుదేవత విగ్రహము కొరకు ఇశ్రాయేలీయులు వారి వెండి, బంగారములను ఇచ్చియున్నారు. దేవుడు నీకిచ్చిన వాటిని నీవు ఈ లోకానికి లేక నీ సుఖభోగలములకు మాత్రమే ఉపయోగిస్తావా?
తప్పిపోయిన కుమారుని ఉపమానమును గుర్తుపెట్టుకోవాలి. అతడు తండ్రి యొద్ద నుండి ధనమును తీసుకొని, దానిని దేవుని వ్యాపారము నిమిత్తము ఉపయోగించలేదు. తనకున్నదంతకు తనకొరకే ఖర్చుపెట్టాడు. ఇది దిగజారిపోయిన దేవుని ప్రజల గుర్తు అయియున్నది. వారు దేవునిలో నుండి అనేక వరములు, విషయాలు పొందుకుంటారు కాని వాటితో వారు ఏమిచేస్తారు? వారు ఇలా అనుకుంటారు. ఈ శరీరము నాది కాబట్టి నాయిష్టము వచ్చినట్లు వాడుకుంటాను. తెలివితేటలు నావి కాబట్టి నాయొక్క స్వలాభముకొరకు వాడుకుంటాను. ధనము నాది ఎందుకంటే నేనే సంపాదించుకున్నాను. కాబట్టి నాయిష్టము వచ్చినట్లు ధనమును ఉపయోగిస్తాను. దేవుడు అనుగ్రహించిన వెండి, బంగారములను బయలుదేవతకు ఇవ్వటమంటే ఇదియే. "వారికున్నదంతయు నేను అనుగ్రహించినదేనని వారు గ్రహించుటలేదని" దేవుడు చెప్పుచున్నాడు. నీ విషయములో ఏవిధముగా ఉన్నది? నీకున్నదంతయు దేవుడు నీకు అనుగ్రహించినదేనని నీవు గ్రహించినట్లయితే, నీవు దానిని తిరిగి దేవునికిచ్చి ఇట్లనెదవు "ప్రభువా, నాకున్నదంతయు నీవు ఇచ్చియున్నావు నీ రాజ్యము కొరకే దానిని ఉపయోగించాలని కోరుచున్నాను".
ఇశ్రాయేలీయులు అపనమ్మకస్థులైనప్పటికీ ప్రభువు ఇట్లనుచున్నాడు "పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాటలాడుదును" (హోషేయ 2:14). పూర్తిగా అపనమ్మకస్థురాలైన భార్యతో ఏ భర్త కూడా అంత దయతో మాట్లాడడు. కాని ప్రభువు ఇట్లనుచున్నాడు "అక్కడనుండి దానిని తోడుకొనివచ్చి దానికి ద్రాక్షచెట్లనిత్తును; ఆకోరు (శ్రమగల)లోయను నిరీక్షణద్వారముగా చేసెదెను, బాల్యమున ఐగుప్తు దేశములోనుండి అది వచ్చినప్పుడు నా మాట వినునట్లు" (హోషేయ 2:15). దోపుడు సొమ్మును దొంగలించి పాపము చేసినందున ఆకోరులో ఆకాను చంపబడ్డాడు (యెహోషువా 7వ అధ్యాయము). పాపమునకు శిక్ష విధించేస్థలమది. మరియు ప్రభువు ఇట్లనుచున్నాడు "తీర్పు తీర్చే స్థలములనే మీకు నిరీక్షణకాధారముగా చేసెదను. మీరు తప్పిపోయినందున తీర్పు తీర్చబడి, దండించబడినప్పటికీ మీపాపమును ఒప్పుకున్నారు కాబట్టి రాబోయే రోజులలో మీ జీవితాలలో ఉన్న మారా అంతయు మధురముగా చేయబడునట్లు దీనినే మీకు ఆశీర్వాదముగా మార్చెదను.
తప్పిపోయినవారికి దేవునికి దూరమైనవారికి మరియు తమ జీవితమును వ్యర్ధము చేసుకున్నవారికి ఇది అద్భుతమైన సందేశము. వారి జీవితములోని అనేక సం||లు వ్యర్ధము చేసుకొనినందుకు మరియు వారు చేసిన అనేక తప్పులను బట్టి అనేకులు నిరాశపడుదురు. వారు యౌవనస్థులుగా ఉన్నప్పుడే ఈ సత్యములన్నియు తెలిసియుంటే బాగుండేదని అనుకుంటారు. నీవు దండించబడి మరియు బాధపడియుండవచ్చును. ఇప్పుడు ప్రభువు ఇట్లనుచున్నాడు, "నీవు నిరాశపడవద్దు ఆకోరు లోయను నీకు నిరీక్షణకాధారముగా చేస్తాను".
ప్రభువు ఇంకను ఇట్లనుచున్నాడు, "నీవు-బయలు అని నన్ను పిలువక-నా పురుషుడవు అని పిలుతువు" (హోషేయ 2:16).ఈనాడు ప్రభువుతో మనకున్న భార్యభర్తల సంబంధమును గూర్చి పాతనిబంధనలో వారికి తెలియదు. ఈ సంబంధాన్నే పరిశుద్ధాత్ముడు మనలోనకి తెచ్చియున్నాడు. అబ్రాహాము సేవకుడు రిబ్కాను ఇస్సాకు దగ్గరకు తెచ్చినట్లే, ప్రభువైనయేసును మనము వివాహము చేసుకొనునట్లు మనలను పరిశుద్ధాత్ముడు ప్రభువైనయేసు యొద్దకు తెచ్చును. పాతనిబంధన కాలములో ఆయనను యజమానుడని పిలిచారు. కాని ఇప్పుడు ప్రభువు ఇట్లనుచున్నాడు, "మీరు ఇప్పుడు నన్ను యజమానుడని ఏమాత్రమును పిలువరు. నా భర్త అని మీరు నన్ను పిలిచెదరు".
ప్రభువుతో నీవు ఎట్టి సంబంధాన్ని కలిగియున్నావు? ఈనాడు ఆయన నీకు కేవలము యజమానుడుగా కాదుగాని నీభర్తగా ఉండాలని కోరుచున్నాడని నీకు తెలియునా? చాలామంది సేవకులు దేవుని సేవను భర్తకు చేసినట్లుగా కాక యజమానునికి చేసినట్లుగా చేయుచున్నారు. కాబట్టి వారు సంతోషముగా సేవ చేయుటలేదు. కేవలము జీతము కొరకు కఠినమైన యజమానుని క్రింద చేసినట్లుంది. కాని ఒక భార్య తనభర్తకు జీతము కొరకు పరిచర్య చేయదు. భర్తవలె యజమానుడు తన దాసునికి తన ఆస్థిలో భాగమివ్వడు. ఒక భర్త తన భార్యను సంరక్షించి, పోషించి కాపాడును. కాని భార్య వాటన్నిటికొరకు పరిచర్య చేయదు. ఆమె ప్రేమతో చేస్తుంది. ప్రభువు ఇట్లనుచున్నాడు, "నీవు అపనమ్మకముగా ఉన్నప్పటికీ, నేను నమ్మకమైన వాడుగా ఉండి, నిన్ను ప్రధానము చేసుకొందును (హోషేయ 2:20). తనయొద్ద నుండి దూరముగా తొలగిపోయిన వారిని దేవుడు ఎంతగా ప్రేమించి, కోరుచున్నాడో చూడండి. మనలో ప్రతిఒక్కరి గురించి ప్రభువు ఎంత శ్రద్ధ తీసుకొనుచున్నాడో చూడండి.
హోషేయ భార్య తనను తాను బానిసగా అమ్ముకొనినది. కాని హోషేయ "నేను పదునైదు తులముల వెండియు ఏదుము యవలును తీసికొని దానిని కొనెదను" (హోషేయ 3:2). "చాలా దినములు నీవు వ్యభిచరించక నాయింటిలో నివాసించాలి" అని ఆమెతో చెప్పాడు.
ఇదియే దేవుని ప్రేమ.