ప్రభువైన క్రీస్తు సిలువలో మరణించినప్పుడు విశ్వాసులందరు ఆయనతో కూడా మరణించియున్నారనే గొప్ప సత్యమును గూర్చి పౌలు ఎక్కువగా మాట్లాడియున్నాడు (2 కొరింథీ 5:14 ). ఈ విషయము గురించి అతడు రోమా పత్రిక, కొరింథీ పత్రికలలో మరియు గలతీపత్రికలో మాట్లాడాడు. "నేను క్రీస్తుతో కూడా సిలువవేయబడియున్నాను". "అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందితిరి" (2 కొరింథీ 5:14 ). ఈ ప్రత్యేకమైన ప్రత్యక్షతను దేవుడు పౌలుకు అనుగ్రహించియున్నాడు. పేతురు, యోహాను మరియు యాకోబు దీని గురించి వ్రాసినట్లు మనము చదువము. దేవుని దృష్టిలో(ఎదుట) ప్రభువైన క్రీస్తు మరణించి మరియు తిరిగి లేచినప్పుడు, విశ్వాసులందరును ఆయనతో కూడా మరణించి మరియు ఆయనతో తిరిగి లేచియున్నారు. కాబట్టి ఇప్పుడు మనము మనకొరకు కాక ఆయనే మనలో జీవిస్తున్నాడు కాబట్టి ఆయన కొరకు మాత్రమే జీవిస్తాము.
"క్రీస్తు ఎందుకు మరణించారని" మనము విశ్వాసులనడిగినట్లయితే, వారిలో ఎక్కువ మంది ఇచ్చే జవాబు ఏమిటనగా "క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను" ( 1 కొరింథీ 15:3 ). అది నిజము. కాని అది జవాబులో ఒక భాగము మాత్రమే. రెండవభాగము "జీవించు వారికమీదట తమకొరకుకాక, తమనిమిత్తము మృతిపొంది తిరిగిలేచిన వానికొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతిపొందెను" (2 కొరింథీ 5:15 ). మనము మనకొరకే జీవించినయెడల, క్రీస్తు మన కొరకు మరణించి, మనలను కూడా మరణింపజేసిన ఉద్దేశ్యమును అభ్యంతరపరుస్తాము. మనము ఎల్లప్పుడు పాపములోనే జీవిస్తున్నట్లయితే, క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయారనే దానిని ఆసరాగా తీసుకొని, దేవుని కృపను ఉపయోగించుకొనుచున్నాము. ఏ విశ్వాసియైనను తనకొరకే తాను జీవిస్తున్నట్లయితే, క్రీస్తు మరణము యొక్క ఉద్దేశ్యము అతడు సరిగా గ్రహించలేదు. దేవునియొక్క సంపూర్ణ సత్యము మనమెరుగకుండునట్లు, సాతాను గ్రుడ్డితనము కలుగచేయాలని ప్రయత్నిస్తాడు. ప్రభువైనక్రీస్తు మరణముగురించి మనము ఏమియు గ్రహించకుండునట్లు సాతాను ప్రయత్నించును. క్రీస్తు మన పాపములకొరకు మృతిపొందియున్నాడని గ్రహించినట్లయితే, క్రీస్తు మరణము యొక్క సంపూర్ణ ఉద్దేశ్యము మనము గ్రహించకుండునట్లు (చూడకుండునట్లు) మనకళ్ళకు గ్రుడ్డితనము కలుగజేయుటకు సాతాను ప్రయత్నిస్తాడు.
స్వజీవము నుండి మనము నిత్యవిమోచన పొందునట్లు క్రీస్తు మన కొరకు మరణించారు. 1 కొరింథీ 15:3 మరియు 2 కొరింథీ 5:14,15 వచనములను మనము కలిపి చదివినట్లయితే, పాపమంతటికీ కారణము మన స్వజీవము (మనకొరకే మనము జీవించుట) అని చూడగలము. తన కొరకే తాను జీవించేవాడు ఎల్లప్పుడు పాపములో జీవించును. నీకొరకే నీవు జీవించినంతకాలము, నీవు పాపము మీద జయము(విడుదల) పొందలేవు. మనము చెట్టుయొక్క వేరును నరికివేయనంతవరకు, ఆ చెట్టు ఆఫలములనే ఫలించును. నీవు స్వార్ధమనే వేరుపై గొడ్డలి వేసినయెడల, అప్పుడు ఎల్లప్పుడు నీవు చేదుఫలములను (పాపమును) కోయనవసరము లేదు.
చాలామంది కొంతవరకు పాపము నుండి విడుదల పొందియున్నారు. కాని తన కొరకే తాను జీవించటమనే వేరు ఇంకను ఉన్నది. నీవు నీకొరకే జీవించినంతవరకు పాపము మీద జయము నీకురాదు. కాబట్టి నీవొక నిర్ణయము తీసుకోవాలి, "ఈ రోజు నుండి నాకు నేనే కేంద్రముగా ఉండునట్లు నిర్ణయములు తీసుకొనను. దాని ద్వారా నాకు మాత్రమే ఏమి లాభము వస్తుందోననే దానిని బట్టి నేను నిర్ణయము తీసుకొనను". అనేకమంది క్రైస్తవ పరిచారకులు ఈవిధముగా ప్రశ్నించుకొని నిర్ణయము తీసుకుంటారని మీకు తెలుసా? దీని వలన నాకు లాభమేమిటి? దీని ద్వారా నా కుటుంబానికి ఏమి ప్రయోజనము దొరకుతుంది?". ఆవిధముగా ఈ లోకములో మారుమనస్సు పొందని, దేవునిని కలిగిలేని ప్రజలు కూడా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విషయములో నీకును వారికిని తేడా లేదు. వారు సంఘమునకు వెళ్ళరు. నీవు వెళ్ళతావు. కాని నిర్ణయములు తీసుకొనే విషయములో ఇద్దరు ఒకటిగానే ఉన్నారు. ప్రభువైనయేసు దాని నుండి మనలను విడిపించుటకే మన కొరకు మృతిపొందియున్నారు. కాబట్టి ఇప్పడు మనము ఏదో మన లాభముకొరకు నిర్ణయాలు తీసుకొనము గాని దేవుడు మహిమ పరచబడునట్లును, ఆయన రాజ్యము మరియు ఆయన ఉద్దేశ్యము నిమిత్తము మనము నిర్ణయాలు తీసుకుంటాము. ఇటువంటివారు 100 మంది ఉన్నప్పటికినీ, ఇండియాను తలక్రిందులు చేయగలరు. కాని అట్టివారిని కొద్ది మందినైనను కనుగొనుట చాలాకష్టము.
ఇకమీదట మనము మన కొరకే జీవించకూడదని చాలామంది క్రైస్తవులు గ్రహించుటలేదు. వారు 2 కొరింథీ 5:15 ని దాటవేసి 2 కొరింథీ 5:17 ను చదువుతారు, "పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను" - అనగా నూతనసృష్టి. నన్ను ఒక ప్రశ్న అడుగనివ్వండి, "గతించిన పాతవి ఏమిటి? లేక గతించవలసినవేమిటి?" నీ కొరకే నీవు జీవించుట గతించిందా? నీ కోరికలు మరియు ఉద్దేశ్యములు నూతనపరచబడినవా?